| Daily భారత్
Logo




“డిప్రెషన్ - Depression" (బలహీనత కాదు… చికిత్స అవసరమైన మానసిక వ్యాధి)

News

Posted on 2026-05-21 18:34:59

Share: Share


“డిప్రెషన్ - Depression" (బలహీనత కాదు… చికిత్స అవసరమైన మానసిక వ్యాధి)

వ్యాస కర్త: ప్రముఖ సైకాలజిస్ట్ కె. పున్నంచందర్, సిరిసిల్ల, TPA రాష్ట్ర ఉపాధ్యక్షుడు 

MSc Psychology, MSW Medical & Psychiatry, LLB

(తెలంగాణ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక (10) వ్యాసం)

డైలీ భారత్, స్పెషల్: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న మానసిక ఆరోగ్య సమస్యలలో డిప్రెషన్ ఒకటి. చాలా మంది డిప్రెషన్‌ను కేవలం బాధ, నిరాశ లేదా మనసు బలహీనతగా భావిస్తారు. కానీ వాస్తవానికి డిప్రెషన్ అనేది ఒక మానసిక వ్యాధి. ఇది వ్యక్తి ఆలోచనలు, భావోద్వేగాలు, ప్రవర్తన, శారీరక ఆరోగ్యం, కుటుంబ సంబంధాలు, ఉద్యోగం, చదువు వంటి జీవితంలోని అన్ని రంగాలపై ప్రభావం చూపుతుంది.

డిప్రెషన్ ఉన్న వ్యక్తి బయటకు సాధారణంగా కనిపించినా, లోపల తీవ్రమైన మానసిక పోరాటాన్ని ఎదుర్కొంటూ ఉంటాడు. అందుకే దీన్ని సరైన సమయంలో గుర్తించడం, అర్థం చేసుకోవడం మరియు తగిన సహాయం అందించడం చాలా అవసరం.

"ఇష్టపడిన పనుల పట్ల ఆసక్తి తగ్గడం"

డిప్రెషన్‌లో ఉన్న వ్యక్తికి తరచుగా నిరుత్సాహం, బాధ, జీవితంపై ఆసక్తి కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మునుపు ఇష్టపడిన పనుల పట్ల ఆసక్తి తగ్గిపోవడం, ఒంటరిగా ఉండాలని అనుకోవడం, చిన్న విషయాలకు బాధపడటం, ఏడవడం, కోపపడటం వంటి మార్పులు కనిపించవచ్చు. కొంతమందిలో నిద్రలేమి లేదా ఎక్కువ నిద్ర, ఆకలి తగ్గిపోవడం లేదా ఎక్కువగా తినడం, అలసట, ఏకాగ్రత లోపం వంటి సమస్యలు ఉంటాయి. తీవ్రమైన పరిస్థితుల్లో “నేను పనికిరానివాడిని”, “నా వల్ల ఎవరికీ ఉపయోగం లేదు” అనే భావనలు రావచ్చు. కొందరిలో ఆత్మహత్య ఆలోచనలు కూడా కనిపించవచ్చు.

"ప్రారంభ దశలోనే గుర్తించాలి"

డిప్రెషన్‌ను కుటుంబ సభ్యులు ప్రారంభ దశలోనే గుర్తించడం చాలా ముఖ్యం. వ్యక్తి మునుపటిలా మాట్లాడకపోవడం, కుటుంబ కార్యక్రమాలకు దూరంగా ఉండటం, ఎక్కువగా ఒంటరిగా గడపడం, నిరుత్సాహంగా కనిపించడం, చదువు లేదా పనిలో పనితీరు తగ్గిపోవడం వంటి మార్పులను గమనించాలి. “జీవితం వృథా”, “నాకు బ్రతకాలని లేదు” వంటి మాటలు మాట్లాడితే వాటిని చాలా సీరియస్‌గా తీసుకోవాలి. ఇటువంటి లక్షణాలు కొన్ని వారాల పాటు కొనసాగితే మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించడం మంచిది.

"విమర్శించకుండా వినాలి"

డిప్రెషన్‌తో బాధపడుతున్న వ్యక్తికి మనోధైర్యం కల్పించడం కుటుంబ సభ్యుల ముఖ్య బాధ్యత. “ఇది నీ ఊహ మాత్రమే”, “బలంగా ఉండు”, “అంత చిన్న విషయానికే ఎందుకు బాధపడుతున్నావు” వంటి మాటలు మరింత బాధ కలిగించవచ్చు. వారి బాధను అర్థం చేసుకోవాలి. ఓపికగా మాట్లాడాలి. వారు చెప్పే విషయాలను విమర్శించకుండా వినాలి. ఒంటరిగా వదిలేయకుండా ప్రేమ, భద్రత, అండగా ఉన్నామనే భావన కల్పించాలి. అవసరమైతే వైద్యుల దగ్గరకు తీసుకెళ్లాలి. ఒక మంచి మాట, ఒక ఆప్యాయత, ఒక సహానుభూతి చూపే వ్యక్తి డిప్రెషన్‌లో ఉన్న వారికి పెద్ద బలం అవుతాడు.

"సైకియాట్రిస్ట్ మరియు సైకాలజిస్ట్ ల పాత్ర కీలకం"

డిప్రెషన్ చికిత్సలో సైకియాట్రిస్ట్ మరియు సైకాలజిస్ట్ ఇద్దరి పాత్ర కూడా ఎంతో ముఖ్యమైనది. సైకియాట్రిస్ట్ మానసిక వ్యాధులపై ప్రత్యేక శిక్షణ పొందిన వైద్యుడు. డిప్రెషన్ తీవ్రతను అంచనా వేసి అవసరమైతే మందులు సూచిస్తారు. నిద్ర సమస్యలు, తీవ్రమైన ఆందోళన, ఆత్మహత్య ఆలోచనలు వంటి పరిస్థితులను నియంత్రించడంలో వారు కీలక పాత్ర పోషిస్తారు.

ఇక సైకాలజిస్ట్ వ్యక్తి ఆలోచనలు, భావోద్వేగాలు, ప్రవర్తనను అర్థం చేసుకుని మానసిక స్థితిని మెరుగుపరచడానికి సహాయం చేస్తారు. వ్యక్తి బాధను ఓపికగా వింటారు. నెగెటివ్ ఆలోచనలను గుర్తించి వాటిని పాజిటివ్ మరియు వాస్తవిక ఆలోచనలుగా మార్చేందుకు సహాయం చేస్తారు. డిప్రెషన్ కు కారణమైన మూలాలను గుర్తించి సరైన ఆలోచనలను పెంపొందించేందుకు కృషి చేస్తాడు. ఆత్మహత్య ఆలోచనలను మదిలోంచి తీసేసేందుకు వివిధ రకాల కౌన్సెలింగ్, థెరపీలను అందించి మరల అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు వాటిని ఏ విధంగా అధిగమించాలో నేర్పిస్తారు. ఒత్తిడిని ఎదుర్కొనే నైపుణ్యాలు నేర్పిస్తారు. కుటుంబ సభ్యులకు కూడా సమస్యపై అవగాహన కల్పిస్తారు.

డిప్రెషన్ చికిత్సలో సైకాలజిస్టులు పలు రకాల థెరపీలు ఉపయోగిస్తారు. Cognitive Behaviour Therapy (CBT) ద్వారా నెగెటివ్ ఆలోచనలను మార్చడం జరుగుతుంది. Behaviour Therapy ద్వారా వ్యక్తి రోజువారీ జీవితంలో మళ్లీ చురుకుదనం పెంపొందించబడుతుంది. Supportive Therapy ద్వారా భావోద్వేగ మద్దతు అందించబడుతుంది. Family Counselling ద్వారా కుటుంబ మద్దతు పెంచబడుతుంది. Stress Management Therapy ద్వారా ఒత్తిడిని నియంత్రించే పద్ధతులు నేర్పిస్తారు. అలాగే ధ్యానం, రిలాక్సేషన్ టెక్నిక్స్, శ్వాసక్రియలు వంటి పద్ధతులు కూడా ఉపయోగపడతాయి.

డిప్రెషన్‌లో భావోద్వేగ అసమతుల్యత ఎక్కువగా కనిపిస్తుంది. కొన్నిసార్లు తీవ్ర బాధ, కొన్నిసార్లు కోపం, మరికొన్నిసార్లు ఖాళీగా ఉన్న భావన కలుగుతుంది. సైకాలజిస్టులు భావోద్వేగాలను గుర్తించడం, వాటిని ఆరోగ్యకరంగా వ్యక్తపరచడం, భావోద్వేగ నియంత్రణ సాధించడం వంటి విషయాల్లో సహాయం చేస్తారు. మైండ్‌ఫుల్‌నెస్, రిలాక్సేషన్ టెక్నిక్స్, ఎమోషనల్ మేనేజ్మెంట్ పద్ధతుల ద్వారా వ్యక్తి క్రమంగా మానసిక సమతుల్యతను తిరిగి పొందగలుగుతాడు.

డిప్రెషన్ చికిత్సలో లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ కూడా చాలా ముఖ్యం. మంచి నిద్ర, సమతుల ఆహారం, క్రమమైన వ్యాయామం, యోగా, ధ్యానం, కుటుంబ సభ్యులతో సమయం గడపడం, సోషల్ మీడియా వినియోగాన్ని తగ్గించడం వంటి మార్పులు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. రోజువారీ చిన్న లక్ష్యాలను పెట్టుకుని పూర్తి చేయడం ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రకృతిలో కొంత సమయం గడపడం, ఇష్టమైన పనులు చేయడం కూడా మంచి ఫలితాలను ఇస్తాయి.

"జీవితాంతం ఉండే వ్యాధి కాదు"

డిప్రెషన్ అనేది జీవితాంతం ఉండే శాపం కాదు. సరైన సమయంలో గుర్తించి, కుటుంబ మద్దతు, సైకాలజికల్ థెరపీ, అవసరమైతే వైద్య చికిత్స తీసుకుంటే వ్యక్తి మళ్లీ సాధారణ జీవితంలోకి రావచ్చు. డిప్రెషన్‌తో బాధపడుతున్న వారిని విమర్శించడం కాదు… అర్థం చేసుకోవడం అవసరం. వారిని ఒంటరిగా వదిలేయకుండా ప్రేమతో, సహానుభూతితో అండగా నిలబడాలి.

“మానసిక ఆరోగ్యం కూడా శారీరక ఆరోగ్యంతో సమానమే” అనే అవగాహన ప్రతి కుటుంబంలో పెరిగితేనే ఆరోగ్యకరమైన సమాజం నిర్మాణం సాధ్యమవుతుంది.

VISIT US:

SANJANA CLINIC 

(Neuro Psychiatric & Counseling Center)

Shiva nager khaman, Main Road, Sircilla

Image 1

హ్యూమన్‌ రైట్స్‌ జిల్లా చైర్మన్‌గా దేవోల్లా రాములు

Posted On 2026-06-13 20:33:57

Readmore >
Image 1

అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-13 20:32:49

Readmore >
Image 1

ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల పై పంచాయతీ కన్ను

Posted On 2026-06-13 11:36:13

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన

Posted On 2026-06-13 11:35:06

Readmore >
Image 1

కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు

Posted On 2026-06-13 11:33:30

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు

Posted On 2026-06-13 11:31:24

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం

Posted On 2026-06-13 11:26:02

Readmore >
Image 1

రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?

Posted On 2026-06-13 11:25:04

Readmore >
Image 1

బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి

Posted On 2026-06-12 22:38:10

Readmore >
Image 1

పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే

Posted On 2026-06-12 21:45:03

Readmore >