Posted on 2025-11-26 20:05:26
వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణికుముదిని సూచించారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ.రాణి కుముదిని బుధవారం జిల్లా కలెక్టర్లు, సీ.పీలు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, అదనపు డీసీపీ బస్వారెడ్డి వీ.సీలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా గల గ్రామ పంచాయతీలకు మూడు విడతలలో ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసిందని గుర్తు చేశారు. డిసెంబర్ 11న మొదటి విడత, డిసెంబర్ 14న రెండవ విడత, డిసెంబర్ 17న మూడవ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తామని అన్నారు.
పంచాయతీ ఎన్నికలకు సంబంధించి గ్రామాల వారీగా అప్డేట్ చేసిన రిజర్వేషన్లు, ఏ విడతలో పోలింగ్ ఉంటుంది, పోలింగ్ కేంద్రాల జియో లోకేషన్ తదితర వివరాలను వెంటనే టి-పోల్ వెబ్ సైట్, యాప్ లో నమోదు చేయాలని సూచించారు. టి-పోల్ వెబ్ సైట్, యాప్ లో వచ్చే ఫిర్యాదుల పరిష్కారం కోసం జిల్లాలో నోడల్ అధికారిని నియమించాలని, ఎన్నికల కమిషన్ నుంచి వచ్చే ఫిర్యాదులను మూడు రోజులలో పరిష్కరించాలని అన్నారు.
నవంబర్ 23న ఖరారు చేసిన తుది ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితాను అనుసరిస్తూ పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. రెండు కంటే ఎక్కువ పోలింగ్ కేంద్రాలు ఉన్న భవనం దగ్గర హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని, వెబ్ క్యాస్టింగ్ జరిగే పోలింగ్ కేంద్రాల వివరాలు పంపాలని, పోలింగ్ కేంద్రాలలో వెలుతురు, ఫర్నిచర్, విద్యుత్ సరఫరా, తాగు నీరు, టాయిలెట్స్ వంటి కనీస వసతులు ఉండేలా ఏర్పాట్లు చేయాలని అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మొదటి విడత ఎన్నికల నోటిఫికేషన్ నవంబర్ 27న ఉదయం 10.30 గంటల వరకు విడుదల చేయాలని సూచించారు. నోటిఫికేషన్ జారీ చేయడంతో పాటు పంచాయతీ పరిధిలోని ఓటరు జాబితా వివరాలను ప్రచురించాలని అన్నారు .
నవంబర్ 27 నుంచి నవంబర్ 29 వరకు ప్రతిరోజు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను స్వీకరించాలని, పంచాయతీ ఎన్నికలకు సంబంధిత రిటర్నింగ్ అధికారులు వద్ద నామినేషన్ దాఖలు చేసేందుకు వీలుగా అవసరమైన ఏర్పాట్లు చేయాలని అన్నారు.
నామినేషన్ల పరిశీలన నవంబర్ 30న సాయంత్రం 5 గంటల వరకు పూర్తి చేసి చెల్లుబాటైన నామినేటెడ్ అభ్యర్థుల జాబితాను ప్రకటించాలని తెలిపారు. అభ్యర్థుల జాబితాపై అప్పీల్స్ కోసం డిసెంబర్ 01, సాయంత్రం 5 గంటల వరకు గడువు ఉంటుందని, డిసెంబర్ 2 నాడు అప్పీల్స్ పరిష్కరించాలని, నామినేషన్ల ఉపసంహరణకు డిసెంబర్ 03 మధ్యాహ్నం మూడు గంటల వరకు గడువు ఉంటుందని, అదే రోజు పోటీ చేసే అభ్యర్థుల జాబితా ప్రచురణ చేయాలని సూచించారు.
నామినేషన్ల స్వీకరణ, పరిశీలన,అప్పిళ్ళ పరిష్కారం, గుర్తుల కేటాయింపు, పోటి చేసే అభ్యర్థుల ప్రకటన పకడ్బందీగా జరిగేలా జిల్లా ఎన్నికల అధికారులు పర్యవేక్షణ చేస్తూ, అవసరమైన మార్గదర్శకాలు జారీ చేయాలని అన్నారు. జిల్లాలో ఉన్న ప్రింటర్లకు అనుమతి లేకుండా ఎన్నికల ప్రచార కరపత్రాల ముద్రణ చేయకూడదంటూ ఆదేశాలు జారీ చేయాలని, ఎన్నికల ప్రచారంకు సంబంధించి అభ్యర్థుల వ్యయ వివరాలను నమోదు చేసేందుకు ధరలను ఖరారు చేయాలని, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని కలెక్టర్ లకు సూచించారు. ప్రతి మండలానికి ఒక ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందం, ఒక ఏ.ఈ.ఓ (సహాయ వ్యయ వివరాల నమోదు అధికారి), ప్రతి జిల్లాకు ఒక స్టాటిక్ సర్వేలెన్స్ బృందం ఏర్పాటు చేసి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు తప్పనిసరిగా జరిగేలా పర్యవేక్షించాలని అన్నారు. జిల్లా స్థాయిలో ఎం.సి.ఎం.సి కమిటి, మీడియా సెల్ ఏర్పాటు చేయాలని అన్నారు. ఎన్నికల ప్రచార సమయంలో వినియోగించే ఎలక్ట్రానిక్ వీడియోలకు ముందుగా ఎం.సి.ఎం.సి అనుమతి ఉండాలని అన్నారు. ఎన్నికల దృష్ట్యా తనిఖీలు నిర్వహించే నేపద్యంలో రైతులు పంట డబ్బులు తీసుకుని వెళ్లే సమయంలో తప్పనిసరిగా రశీదు పెట్టుకునేలా అవగాహన కల్పించాలని అన్నారు.
ఎం.సి.సి అమలులో నిర్వహించే తనిఖీలలో నగదు, బంగారం, ఇతర పరికరాలు సీజ్ చేసే సమయంలో తప్పనిసరిగా రశీదు అందించాలని, సీజ్ చేసిన పరికరాలకు సంబంధించిన ఆధారాలు సమర్పించేందుకు ఏ అధికారి ముందు హాజరు కావాలనే వివరాలు ఆ రసీదు లో తెలియజేయాలని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రావు, నోడల్ అధికారులు పాల్గొన్నారు.
వీర్లపల్లిలో పచ్చని మారణకాండ: ఎమ్మెల్యే నోట "పిచ్చి మొక్కల" మాట!
Posted On 2026-04-26 07:56:12
Readmore >
పెట్రోల్, డీజిల్ నిల్వలపై ఆందోళన వద్దు : కలెక్టర్ కృతిక శుక్ల
Posted On 2026-04-25 22:28:14
Readmore >
కానిస్టేబుల్ భార్య, అతడి కుమారుడ్ని కత్తితో పొడిచి చంపిన ప్రియురాలు
Posted On 2026-04-25 21:27:36
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : బాల్య వివాహం... అడ్డుకున్న అధికారులు..
Posted On 2026-04-25 17:10:44
Readmore >